ఇండోర్ : డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. బుధవారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌ను 89 రన్స్ తేడాతో ఓడించి టోర్నీలో బోణీ కొట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనా ఆరో స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ (83 బంతుల్లో 115, 16 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకంతో మెరువగా లిచ్‌ఫీల్డ్ (45), కిమ్ గార్త్ (38) విలువైన పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు 49.3 ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో కివీస్ 43.2 ఓవర్లలో 237 రన్స్‌కే చేతులెత్తేసింది. కెప్టెన్ సోఫీ డెవిన్ (112 బంతుల్లో 112, 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో పోరాడినా ఆమెకు అండగా నిలిచేవాళ్లు లేకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గార్డ్నర్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 128 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లీ తహుహు (3/42), స్పిన్నర్ అమెలియా కెర్ (2/54) విజృంభించడంతో ఆ జట్టు టాపార్డర్ కుదేలైంది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన గార్డ్నర్.. కివీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొట్టింది. మధ్య ఓవర్లలో మెక్‌గ్రాత్ (26), ఆఖర్లో గార్త్ ఆమెకు అండగా నిలిచారు. ఒకదశలో 250 పరుగులైనా చేస్తుందా? అనిపించిన ఆసీస్.. ప్రత్యర్థి ఎదుట ఏకంగా 327 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిందంటే అది ఆష్లే ఇన్నింగ్స్ గొప్పదనమే. 77 బంతుల్లోనే శతకం చేసిన ఆమె.. మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలలో ఆరోస్థానం లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.
0/2. భారీ ఛేదనలో కివీస్ పరిస్థితి ఇది. ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. కానీ కెర్ (33)తో కలిసి డెవిన్ కివీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 75 రన్స్ జోడించారు. కానీ 20వ ఓవర్లో అలానా కింగ్.. కెర్‌ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బకొట్టింది. బ్రూక్ హ్యాలీడె (28), గేజ్ (28), గ్రీన్ (20) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. డెవిన్ ఒంటరిపోరాటంతో శతకం బాదినా 43వ ఓవర్లో ఆమె నిష్క్రమణతో కివీస్ ఓటమి ఖరారైంది.
ఆస్ట్రేలియా : 49.3 ఓవర్లలో 326 ఆలౌట్ (ఆష్లే 115, లిచ్‌ఫీల్డ్ 45, తహుహు 3/42, కెర్ 3/59);
న్యూజిలాండ్: 43.2 ఓవర్లలో 237 ఆలౌట్ (డెవిన్ 112, కెర్ 33, మొలినెక్స్ 3/25, అన్నాబెల్ 3/26)