సూరత్: ఎస్బీఐ ఏటీఎం నుంచి 10 వేల విత్‌డ్రా చేయాలనుకున్నాడు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్. అతను కార్డు పెట్టి, పిన్ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత అతనికి పదివేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఏటీఎం నుంచి క్యాష్ రాలేదు. దీంతో ఆ వ్యక్తి ఖంగారు పడ్డాడు. బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వినియోగదారుల ఫోరమ్‌కు వెళ్లాడు. అక్కడ కేసులో వాదనలు జరిగాయి. 9 ఏళ్ల తర్వాత సమస్య పరిష్కారమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు జరిమానా వేశారు. ఆ కస్టమర్‌కు 3 లక్షలు చెల్లించాలని కన్జ్యూమర్ ఫోరమ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.
2017 ఫిబ్రవరి 18వ తేదీన సూరత్‌లోని ఓ వ్యక్తి ఎస్బీఐ ఏటీఎం 10 వేల విత్‌డ్రా కోసం వెళ్లాడు. అతను పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ నగదు రాలేదు. షాక్‌కు గురైన అతను ఫిబ్రవరి 21వ తేదీన దుంబల్ బ్రాంచ్‌కు వెళ్లాడు. మార్చి నుంచి మే 2017 వరకు అతను తన బ్యాంక్‌కు మెయిల్స్ చేశాడు. ఓ దశలో ఆర్బీఐకి వెళ్లాడు. ఏటీఎం సెంటర్లోని సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించాలని కూడా అతను ఆర్టీఐ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ అధికారులు పట్టించుకోలేదు. 2017 డిసెంబర్20వ తేదీన అతను వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు.
విచారణ సమయంలో.. ఏటీఎం ఎస్బీఐ బ్యాంక్‌కు చెందినదని, ట్రాన్జాక్షన్ సక్సెస్ చూపించిందని, అలాంటప్పుడు ఆ బ్యాంక్‌దే బాధ్యత అని బ్యాంక్ ఆఫ్ బోర్డు వాదించింది. కానీ ఆ వాదనను వినియోగదారుల ఫోరమ్ కొట్టిపారేసింది. ఆ ట్రాన్జాక్షన్కు చెందిన ఆధారాలను చూపించాలని కస్టమర్ బ్యాంక్‌ను కోరింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం అయిదు రోజుల్లోనే ఆ డబ్బు కస్టమర్ ఖాతాలో జమా కావాలని కమిషన్ చెప్పింది. తన తుది తీర్పులో ఫోరమ్ ఆదేశాలిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఫైన్ వేసింది.
కస్టమర్‌కు చెందిన పదివేల అమౌంట్‌పై 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు రోజుకు రూ.100 జరిమానా కూడా చెల్లించాలని కోరింది. 2026 ఫిబ్రవరి 26 నాటికి ఆ కస్టమర్ తన డబ్బును కోల్పోయి 3288 రోజులు అయ్యింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా అతనికి కనీసం 3 లక్షల 28 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మానసికంగా వేధించినందుకు మూడు వేలు, లీగల్ ఖర్చు రెండు వేలు కూడా చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ బ్యాంక్‌ను ఆదేశించింది.