ముంబై : టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ గుజరాత్ తరలివెళ్లడం మహారాష్ట్రలో కాక రేపుతోంది. రూ 22000 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గుజరాత్‌కు వెళ్లడం మంచి సంకేతం కాదని ఎన్సీపీ నేత సుప్రియా సూలే అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి ఎందుకు వెళ్లిందనేది ఏక్నాథ్ షిండే ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎయిర్‌బస్ ప్రాజెక్టు రాష్ట్రంలో చేపడితే స్ధానిక యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించేవని అన్నారు.
టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర వీడిన క్రమంలో షిండే సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా, రాష్ట్రానికి రావాల్సిన మెగా ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించేందుకే షిండేను బీజేపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిందని ఎన్సీపీ ప్రతినిధి మహేష్ తాపసీ పేర్కొన్నారు. ఇక గుజరాత్‌లోనే విమానాల తయారీ చేపట్టాలని ఏడాది కిందట కేంద్ర ప్రభుత్వం, ఆయా కంపెనీల మధ్య ఎంఓయూపై సంతకాలు జరగ్గా, ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నారని కొందరు ఉద్దేశపూర్వకంగా యువతను తప్పుదారి పట్టిస్తున్నారని షిండే వర్గానికి చెందిన పరిశ్రమల మంత్రి ఉదయ్ సామంత్ స్పష్టం చేశారు.
ప్రాజెక్టును మహారాష్ట్రకు తీసుకువచ్చేందుకు గత ఎంఏవీ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదని సామంత్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నాగ్‌పూర్‌లోని ప్రతిపాదిత స్ధలంలో ఏర్పాటు చేసేందుకు తాము ఈ ప్రాజెక్టును వెనక్కితీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సామంత్ వెల్లడించారు.