Supreme Court | మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేజీ విశ్వనాథ్ ధర్మాసనం ధిక్కార వ్యాఖ్యలు చేసినందుకు.. ఎందుకు ధిక్కార చర్యలు చేపట్టకూడదని ప్రశ్నించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయిన ఆయనను సెప్టెంబర్ 9న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. పరిహారం చెల్లింపునకు సంబంధించిన కేసులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం ఎగవేత వ్యూహాన్ని అవలంభిస్తోందని.. అదే సమయంలో పరిహారం తిరిగి లెక్కించే నిర్దిష్ట ప్రయోజనం విషయంల సమయం కోరినప్పుడు పూర్తి చేయాలని బెంచ్ పేర్కొంది. పరిహారం విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని అఫిడవిట్ ద్వారా తెలుస్తోందని పేర్కొంది.
పిటిషనర్ విజ్ఞప్తి మేరకు పరిహారాన్ని తిరిగి లెక్కించకపోతే రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన లాడ్లీ బెహన్ యోజనను నిలిపివేస్తామని బెంచ్ హెచ్చరించింది. చట్టాన్ని అనుసరించి పరిహారం చెల్లింపుపై సరైన నిర్ధారణకు రావడం ప్రభుత్వ కర్తవ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పుణె జిల్లా కలెక్టర్, అటవీశాఖ, ఇతరశాఖల అధికారులతో పాటు ఈ అంశంపై మళ్లీ అత్యున్నత స్థాయిలో చర్చించామని ప్రభుత్వం పేర్కొంది. తాజా లెక్కన రూ.48.65కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపింది. పుణె కలెక్టర్ చేసిన పరిహారం మదింపును దరఖాస్తుదారు, కోర్టు ఆమోదించలేదని.. చట్టంలోని నిబంధనలను అనుసరించి లెక్కించడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం పేర్కొంది.