బుధవారం 27 జనవరి 2021
National - Dec 17, 2020 , 10:57:07

వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై నేడు ‘సుప్రీం’ విచారణ

వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై నేడు ‘సుప్రీం’ విచారణ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై, వాటిని వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళనపై గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌తో పాటు డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను రోడ్లపై నుంచి ఖాళీ చేయించాలని ఢిల్లీకి చెందిన రిషబ్‌ శర్మ పిటిషన్ వేశారు. ఈ మూడు పిటిషన్లను చీఫ్‌ జస్టిస్ బొబ్డే ధర్మాసనం మరోసారి విచారించనుంది. ఈ అంశంపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సాగు చట్టాల రద్దు విషయంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ప్రతిష్టంభన కొనసాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

వివాద పరిష్కారం కోసం ఓ కమిటీ వేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రం, రైతు సంఘాలతో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. కేంద్రం, రైతుల వాదలను తర్వాత కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అలాగే దిల్లీ రహదారుల దిగ్బంధం పిటిషన్‌పై విచారణ జరుగనుంది. దేశ రాజధానికి వచ్చే మార్గాల్లో రైతులు బైఠాయించడంతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే వారిని అక్కడి నుంచి ఖాలీ చేయాలని రిషబ్‌ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరుగనుండగా.. సుప్రీం కోర్టు ఏం చెబుతుందోననే ఆసక్తి సర్వతా నెలకొంది. ఇదిలా ఉండగా.. చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 22వ రోజుకు చేరింది.  


logo