Waqf Law | వక్ఫ్ (సవరణ)చట్టం-2025 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ప్రారంభించింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటి వరకు సర్వోన్నత న్యాయస్థానంలో దాదాపు పది పిటిషన్ల దాఖలయ్యాయి. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీలు మహమ్మద్ జావేద్, మహువా మొయిత్రా, జియా ఉర్ రెహమాన్, మనోజ్ కుమార్ ఝా, అమనాతుల్లా ఖాన్‌తో పాటు మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్‌తో పాటు పలు పార్టీలు, ముస్లిం సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.
అయితే, ఈ పిటిషన్లను విచారించే ముందు తమ వాదనలు వినాలని అసోం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం కేవియెట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది. మొదటిది కేసును విచారించాలా? లేదంటే హైకోర్టుకు అప్పగించాలా? అని.. రెండోది న్యాయవాదులు వాదించాలనుకుంటున్న అంశాలపై తెలిపింది. ఓ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పార్లమెంట్ చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాల్లో తలదూర్చడమేనంటూ వాదనలు ప్రారంభించారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ‘చట్టం ప్రకారం’ అనే పదాలు అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని, ఈ పదబంధం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు. వక్ఫ్-అలల్-ఔలాద్‌ను సృష్టించినప్పుడు మహిళల వారసత్వ హక్కులను నిరాకరించరాదని.. దీనిపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదన్నారు.
ఎవరైనా వక్ఫ్‌ను స్థాపించాలనుకుంటే.. అతను ఐదేళ్లు ఇస్లాంను పాటిస్తున్నాడని నిరూపించుకోవాల్సి ఉందని.. ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్‌కు ఇచ్చారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో ముస్లింలు మాత్రమే వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో భాగమని.. సవరణ తర్వాత హిందువులు కూడా భాగం కావొచ్చని.. ఇది పార్లమెంటరీ చట్టం ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ సందర్భంగా హిందువులకు సంబంధించిన వారసత్వ విషయాల్లోనూ ప్రభుత్వం చట్టం చేసిందని, ముస్లిం సమాజం కోసం సైతం పార్లమెంట్ చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేసిన సీజేఐ సంజీవ్ ఖన్నా.. ఇందులో తప్పేముందని ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆర్టికల్ 26 అనేది సెక్యులర్ అని.. ఇది అన్ని మతాలకు వర్తిస్తుందన్నారు. ఈ సందర్భంగా జామా మసీదు అంశాన్ని సైతం ధర్మాసనం ఎదుట కపిల్ సిబల్ లేవనెత్తారు. అయితే, జామా మసీదుతో పాటు అన్ని పురాతన స్మారక చిహ్నాలును కాపాడబడుతాయని సీజేఐ పేర్కొన్నారు.