న్యూఢిల్లీ: శివసేనలోని ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు ఒకరిపై మరొకరు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ పిటిషన్లపై ఈ నెల 31 నాటికి నిర్ణయం తీసుకోవాలని గతంలో మహారాష్ట్ర శాసన సభ స్పీకర్ రాహుల్ నార్వేకర్ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ నెల 20 వరకు శాసనసభ సమావేశాలు జరుగుతాయని, అందువల్ల ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సమంజసమైన రీతిలో గడువును పొడిగించాలని సభాపతి సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్లపై వచ్చే జనవరి 10లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చి, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి, బీజేపీతో చేతులు కలిపి, 2022 జూన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చి, శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. షిండే, ఉద్ధవ్ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లలో ఎదుటి వర్గంలోని ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దుచేశాయని స్పీకర్ను కోరాయి.