న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తాము ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదంది. తమ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఓటేస్తే, జూన్ 2న తాను జైలుకు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో అంటున్నారని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అది ఆయన ఊహ అని.. దానిపై తామేమీ వ్యాఖ్యానించలేమని చెప్పింది. కేజ్రీవాల్ ఎక్కడా జైలుకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించ లేదని ఆయన లాయర్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు.