న్యూఢిల్లీ, మే 20: వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమేనన్న భావన సర్వత్రా ఉందని, అయితే వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషనర్లు తమకు మధ్యంతర ఉపశమనం దక్కాలంటే బలమైన, విస్పష్టమైన ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం వక్ఫ్ చట్టం చట్టబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. వక్ఫ్ బై కోర్ట్స్, వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్‌గా ప్రకించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారంతో సహా మూడు అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. ‘పార్లమెంట్ ఆమోదించిన ప్రతి చట్టం రాజ్యాంగబద్ధమేనన్న భావన ఉంది. మధ్యంతర ఉపశమనం మీకు లభించాలంటే బలమైన, విస్పష్టమైన ఆధారాలు మీరు చూపించాలి. లేకపోతే రాజ్యాంగబద్ధత భావన అలాగే ఉంటుంది’ అని సీజేఐ తెలిపారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదన ప్రారంభిస్తూ వక్ఫ్ చట్టం చారిత్రకంగా, న్యాయపరంగా, రాజ్యాంగ సూత్రాల పరంగా పూర్తి విరుద్ధమని అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ రహిత ప్రక్రియ ద్వారా వక్ఫ్‌ని స్వాధీనం చేసుకునే మార్గంగా ఆయన ఈ చట్టాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ మూడు అంశాలకే పిటిషన్లపై విచారణ పరిమితం కావాలని అభ్యర్థించారు. వక్ఫ్ బై కోర్ట్స్, వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్‌గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం ఈ మూడు అంశాలలో ఒకటి. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పునకు సంబంధించినది రెండో అంశం.
ఎక్స్ అఫిషియో సభ్యులు తప్ప మిగిలిన సభ్యులందరూ ముస్లింలే ఉండాలన్నది పిటిషనర్ల వాదన. ఇక మూడవది, వక్ఫ్ ఆస్తా లేక ప్రభుత్వ ఆస్తా అన్న విషయాన్ని నిర్ధారించడానికి కలెక్టర్ విచారణ చేపట్టిన తర్వాత ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనను పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారు. కాగా, తుషార్ మెహతా వాదనను కపిల్ సిబల్‌తోపాటు పిటిషనర్ల తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ ఎం సింఘ్వి వ్యతిరేకించారు. విచారణ భాగాలుగా ఉండదని వారు వాదించారు. వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నమని, ఏ అంశాలను ప్రస్తావించాలో ప్రభుత్వం నిర్దేశించలేదని సిబల్ పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రక్రియ లేకుండా కార్యనిర్వాహక మార్గం ద్వారా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చట్ట నిబంధనలు సవరించారని సిబల్ వాదించారు. బాధిత కక్షిదారులు కోర్టులను ఆశ్రయించేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ద్వారా వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ నుంచి తప్పించనున్నారని ఆయన చెప్పారు.