న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ ప్రజల కోసం ఓ వార్నింగ్ నోటీసును రిలీజ్ చేసింది. నకిలీ వెబ్సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు యూఆర్ఎల్తో వివిధ రకాల ఫేక్ వెబ్సైట్లు.. ప్రస్తుతం ప్రజల్ని మోసం చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆ నోటీసులో పేర్కొన్నది. ఆ వెబ్సైట్ల ద్వార వ్యక్తిగత, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సుప్రీం ఆరోపించింది. అత్యున్నత న్యాయస్థానానికి చెందిన రిజిస్ట్రీ ఈ విషయాన్ని ద్రువీకరించింది. ఫిషింగ్ అటాక్ జరుగుతున్న అంశం వాస్తవమే అని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొన్నది.
కొన్ని యూఆర్‌ఎల్స్‌తో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం చెలామణి అవుతున్న నకిలీ యూఆర్ఎల్స్కు చెందిన జాబితాను సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. వ్యక్తిగతమైన, రహస్యమైన సమాచారాన్ని ఏమాత్రం బహిర్గతం చేయవద్దు అని కోర్టు తన నోటీసులో పేర్కొన్నది. ఒకవేళ సమాచారం ఇస్తే, దాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు కోర్టు తన వార్నింగ్‌లో తెలిపింది.
ప్రజలు ఎవరు కూడా ఆ వెబ్ లింకులను క్లిక్ చేయరాదు అని, లేదా వాటిని ఓపెన్ చేయరాదు అని సుప్రీం రిజిస్ట్రీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వ్యక్తిగత సమాచారాన్ని అడగదన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆ నోటీసులో తెలిపారు. www.sci.gov.in అని ఉన్న వెబ్సైట్ మాత్రమే సుప్రీంకోర్టుకు చెందుతుందని, ఎప్పుడైనా ఏదైనా యూఆర్ఎల్ వస్తే, దాన్ని సరిచూసుకుని ఓపెన్ చేయాలని సుప్రీం తన నోటీసులో తెలిపింది.
ఒకవేళ మీరు ఫిషింగ్ బాధితుడైతే, తక్షణమే పాస్వర్డ్లు మార్చుకోవాలని కోర్టు సూచించింది. ఫిషింగ్ దాడుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చామని, మరో వైపు ఆ కేసుల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు కోర్టు చెప్పింది.