న్యూఢిల్లీ, మే 17: అధికారులను బెదిరించి రాష్ర్టాల్లో భయానక వాతావరణం సృష్టించవద్దని ఈడీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కావాలనే అధికారులను కేసుల్లో ఇరికిస్తున్నారని, అనుమానాస్పద చర్యలుగా భావించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ కేసు నమోదు చేయగా.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అధికారులను బెదిరించి, కేసుల్లో ఇరికించాలని ఈడీ చూస్తున్నదని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.
తమకు ప్రాణ హాని ఉందని, విచారణ పేరుతో మానసికంగా, శారీరకంగా ఈడీ తమను హింసిస్తున్నదని రాష్ర్టానికి చెందిన 50 మంది ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదు చేశారని ఈ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2023లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నదని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తెల్ల కాగితాలు, డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు అధికారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా విచారణ చేస్తున్నారన్నారు. ఈ వాదనలను అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఖండించారు. ప్రతిపక్షాలను బెదిరించేందుకు మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని వాడుతున్నారని, ఆ చట్టంలోని నిర్దిష్టమైన నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ ఇటీవల ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడీ టార్గెట్ చేసిందని ఆ రాష్ట్రం ఈ పిటిషన్లో పేర్కొంది.
శాంతిభద్రతలపై కండ్లు మూసుకొంటే కుదరదు..
మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిపై కండ్లు మూసుకుంటే కుదరదని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తాజా పరిస్థితి, బాధితులకు అందుతున్న ప్రభుత్వ సాయం, పునరావాసం.. తదితర వివరాలతో నివేదిక అందజేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. శాంతిభద్రతల నిర్వహణ రాష్ర్టాలకు సంబంధించిన అంశమని సుప్రీం గుర్తుచేసింది. గిరిజనులు ఉండే ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.