న్యూఢిల్లీ : బెంగాల్లో ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపునకు గురైన పౌరులకు సుప్రీం కోర్టు ఉపశమనం కల్పించింది. తొలగించిన ఓటర్లు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవచ్చునని, అయితే వారు చేసిన విజ్ఞప్తులపై అధికారులు సకాలంలో నిర్ణయం తీసుకుని ఉండాలని పేర్కొన్నది. ఆర్టికల్ 142 ప్రకారం అర్హత గల ఓటర్లను ఓటింగ్లో పాల్గొనే హక్కు నుంచి తొలగించరాదని తెలిపింది. దీనిపై మూడు రోజుల పాటు జరిపిన విచారణ అనంతరం ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎవరి పేర్లనయితే ఓటరు జాబితాలో నుంచి తొలగించారో వారు కనుక దానిపై దరఖాస్తు చేసుకుని ఉంటే, వారిని అప్పీలేట్ ట్రిబ్యునళ్లు అనుమతించి ఉంటే ఎన్నికల్లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు ఒక స్పష్టమైన గీతను గీసింది. అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ముందు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లు కేవలం పెండింగ్లో ఉన్నంత మాత్రాన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు కారని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937లోని కొన్ని నిర్దిష్ట ప్రొవిజన్లపై స్పందన తెలుపాలని కేంద్రానికి సుప్రీం కోర్ట్ గురువారం నోటీసులు జారీ చేసింది. చట్టంలోని కొన్ని నిబంధనలు మహిళలపై వివక్ష చూపుతున్నాయని దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. షరియత్లోని వారసత్వ నియమాలు ఆస్తుల పంపకంలో మహిళల పట్ల స్పష్టంగా వివక్ష చూపుతున్నాయన్నాయని పిటిషనర్లు వాదించారు.
ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఇలాంటి విషయాలు విధాన పరమైన నిర్ణయాల పరిధిలోకి వస్తాయని చెప్పింది. ఓటేయని వారిపై చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ సూచనపై ధర్మాసనం స్పందిస్తూ ఆ పని కోర్టు చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా ఓటేయని వారికి లభించే ప్రభుత్వ ప్రయోజనాలపై ఆంక్షలు విధించాలని తాము ప్రభుత్వాన్ని బలవంతం చేయలేమన్నారు.