ధన్వాడ/హైదరాబాద్, జూలై 23: బీఎల్వోలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఎల్వోలు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడలో గురువారం బీఎల్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ‘సర్’ ప్రక్రియలో చిత్తశుద్ధ్దితో పనిచేస్తుంటే తమను పని దొంగలంటూ విమర్శించడం తగదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ సింధూజకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు నరహరి, బీఎల్వోలు రాణి, శారద, శ్రీలక్ష్మి, అర్చన, భూదేవి, శాంత, అనిత, సంతోష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులపై సీఎం వ్యాఖ్యలు దుర్మార్గం
కిందిస్థాయి ఉద్యోగులైన బీఎల్వోలు నిద్రపోతున్నారు.. ఉచితంగా జీతాలు తీసుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఖండించారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి అనుచితంగా మాట్లాడటం దుర్మార్గమని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉద్యోగుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. భత్యం ఇవ్వకున్నా అనేక ఇక్కట్ల మధ్య ‘సర్’ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ల శ్రమను గుర్తించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.