Supreme Court | న్యూఢిల్లీ: గవర్నర్లు నివేదించిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలియచేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడాన్ని తప్పు పడుతూ మంగళవారం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించింది. శుక్రవారం ఆ ఉత్తర్వులను బహిర్గతం చేసింది.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 201 అధికరణ కింద రాష్ట్రపతి నిర్వహించాల్సిన బాధ్యతలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. 201 అధికరణ ప్రకారం గవర్నర్ ఒక బిల్లుకు సమ్మతి తెలియచేయకుండా రిజర్వ్‌లో ఉంచితే అప్పడు అది రాష్ట్రపతి పరిధిలోకి వెళుతుంది.. దానికి రాష్ట్రపతి సమ్మతి తెలియచేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు కాల పరిమితిని రాజ్యాంగం నిర్దేశించలేదు. కాగా, అలాంటి బిల్లులను తిరస్కరించే అధికారం రాష్ట్రపతికి లేదని, సమ్మతి తెలియచేయడం లేదా పెండింగ్‌లో ఉంచడం తప్ప రాష్ట్రపతికి వేరే ప్రత్యామ్నాయం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
రాజ్యాంగంలో లేదా చట్టంలో నిర్ణయం తీసుకునేందుకు కాల పరిమితిని నిర్దేశించనప్పటికీ తగిన సమయంలోగా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సిన బాధ్యత ఉంటుందని కోర్టు తెలిపింది. 201 అధికరణ కింద రాష్ట్రపతి నిర్వర్తించే అధికారాలు ఈ చట్టానికి అతీతమని భావించరాదని పేర్కొంది. మూడు నెలలకు మించి జాప్యం జరిగిన పక్షంలో తగిన కారణాలను నమోదు చేసి సంబంధిత రాష్ర్టానికి తెలియ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తీర్పులో ఆదేశించింది.
గవర్నర్ నివేదించిన బిల్లులపై తనకు బిల్లులు అందిన తేదీ నుంచి మూడు నెలల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిర్ణీత కాల పరిమితిలోగా ఎలాంటి చర్య తీసుకోని పక్షంలో సంబంధిత రాష్ర్టాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగపరమైన చెల్లుబాటు కారణాలతో బిల్లును రిజర్వ్‌లో ఉంచిన పక్షంలో న్యాయస్థానాల పాత్రను తక్కువగా అంచనా వేయవద్దని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని 143 అధికరణ కింద తమకు ఎదురవుతున్న ప్రశ్నలను సుప్రీంకోర్టుకు నివేదించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
బిల్లులోని న్యాయపరమైన అంశాలపై గవర్నర్లు లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడతారని చెప్పడానికి తమకు ఎటువంటి మొహమాటం లేదని చెప్పింది. అయితే రాజ్యాంగాపరంగా ఏర్పడిన కోర్టులకు మాత్రమే బిల్లుకు సంబంధించిన రాజ్యాంగబద్ధతను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసే అధికారం ఉందని ధర్మాసనం తెలిపింది. డీఎంకే ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లులకు సమ్మతి తెలియచేయకుండా పెండింగ్‌లో పెట్టి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో పేర్కొంది. బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు మార్గదర్శకాలను జారీ చేసిన సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పాటించని పక్షంలో న్యాయ సమీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.
రాజ్యాంగంలోని అధికరణ 200 ప్రకారం మంత్రి మండలి సలహా, సూచనల మేరకు పని చేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉండవని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలకు సంబంధించిన మినహాయింపులను అధికరణ 200, అధికరణ 162(1) రెండో నిబంధనల్లో గుర్తించవచ్చునని తెలిపింది. అంతేకాక న్యాయస్థానం గవర్నర్ అధికారాలను ఏ విధంగానూ బలహీనపర్చడం లేదని, గవర్నర్ చర్యలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఉండాలని మాత్రమే స్పష్టం చేసిందని సుప్రీంకోర్ట్ తీర్పు పేర్కొంది. మంత్రివర్గ ప్రతిపాదనలో ఆయన అనుభవాన్ని వినియోగించి నిర్మాణాత్మక పాత్రను వహించాలని పేర్కొంది.
చెన్నై, ఏప్రిల్ 12: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టరూపాన్ని దాల్చాయి. రాష్ట్రపతి, గవర్నర్ సంతకం లేకుండా చట్టసభ ఆమోదించిన బిల్లులు చట్టంగా మారడం తమిళనాడులోనే ఒక చారిత్రక సంఘటనగా పేర్కొనవచ్చు. అయితే గవర్నర్ ఆమోదం లేకుండా ఏ బిైల్లెనా ఎలా చట్టరూపం దాలుస్తుంది అన్న అనుమానం అందరికీ కలగడం సహజం. దీనంతటికీ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే కారణం. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను తొక్కిపెట్టడం చట్టవిరుద్ధమని, సమ్మతిని తిరస్కరించిన బిల్లులను రాష్ట్రపతి ముర్ము కోసం పంపాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాంటి బిల్లులు అవి పంపిన తేదీ నుంచి అనుమతి పొందినట్టుగా పరిగణించవచ్చునని జస్టిస్ ఎస్బీ పార్ధివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో గతంలో తాము ఆమోదించిన బిల్లులు 2023 నవంబర్ 18 నుంచి చట్టరూపం దాల్చినట్టు తమిళనాడు ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్లో ప్రకటించింది. వీటిలో యూనివర్సిటీల వీసిల నియామకం, వారి నియామకాల్లో గవర్నర్ల అధికారాలను తగ్గిస్తూ చేసిన బిల్లు కూడా ఉంది.