న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇవాళ సంచలన ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్టు(Digital Arrest) స్కామ్ కేసుల్లో .. దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. అవినీతి కోణంలోనూ స్వేచ్ఛగా దర్యాప్తు చేపట్టవచ్చు అని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్లకు చెందిన మ్యూల్ అకౌంట్ల అంశంలో బ్యాంకుల పాత్రను కూడా ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అధికారాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చి ఈ కేసులో స్పందించారు.
ఇప్పటి వరకు జరిగింది చాలు అని, డిజిటల్ అరెస్టు స్కామ్‌లను తక్షణమే సీబీఐ దర్యాప్తు చేయాలని ధర్మాసనం కోరింది. ఇప్పటి వరకు బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు 3 వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్ల సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులపై దాఖలైన సుమోటో కేసులో ధర్మాసనం ఆదేశాలు జార చేసింది. నకిలీ అకౌంట్లను గుర్తించేందుకు ఏఐ మెషీన్ టూల్స్ పట్ల అవగాహన కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీం కోరింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సైబర్ క్రైం యూనిట్లు సమర్థవంతంగా పనిచేయాలని, ఎటువంటి అవరోధాలు ఎదురైనా కోర్టుకు తెలియజేయాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ-మెయిల్ ద్వారా సమాచారన్ని చేరవేయవచ్చు అని కోర్టు చెప్పింది. విదేశాల్లో ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ సహాయం తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది.