డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పట్టణంలో ఇండ్లు కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. ఇండ్లు, హోటళ్లు, పలు కట్టాల్లో పగులు వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రమాదకర కట్టడాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జోషీమఠ్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అత్యవసర విచారణ విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. ఈ కేసును జనవరి 16వ తేదీ విచారించనున్నట్లు ఇవాళ కోర్టు చెప్పింది.
ముఖ్యమైన ప్రతి అంశంపై సుప్రీంకు రావాల్సిన అవసరం లేదని, ఆ అంశాలపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థలు పనిచేస్తున్నాయని కోర్టు తెలిపింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. జోషీమఠ్ విషయంలో అత్యవసర విచారణ చేపట్టాలని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పిటిషన్ దాఖలు చేశారు.జోషీమఠ్ వాసులకు తొందరగా ఆర్థిక సాయం చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని ఆ పిటిషన్లో డిమాండ్ చేశారు.
జోషీమఠ్‌లో సుమారు 17 వేల జనాభా ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ఈ పట్టణం ఉంది. ఇది సముద్రమట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్లకు వెళ్లే యాత్రికులు ఈ పట్టణంలోనే బస చేస్తారు. ప్రఖ్యాత స్కీయింగ్ పర్యాటక ప్రదేశం అవులీ కూడా ఇక్కడే ఉంది.
జోషీమఠ్‌లో ఉన్న పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అక్కడకు చేరుకున్నారు. ఆ పట్టణంలో ఉన్న ఆర్మీ బేస్ గురించి ఆయన చర్చిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ అధికారులతో మంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.