న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలు, పుకార్లు పుట్టించి వ్యాప్తి చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 22న వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజలను రెచ్చగొట్టేలా, విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ వదంతులను వ్యాప్తి చేసేవారిపై కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ సీనియర్ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించింది. రెచ్చగొట్టే మాటలకు, పుకార్లకు అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ చట్టాలను అధ్యయనం చేసి కఠిన నిబంధనలను రూపొందించాలని, ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీంతో స్పందించిన ధర్మాసనం ఇలాంటి పిటిషన్ ఒకటి 22వ తేదీన విచారణకు రానుందని, దానితో కలిపి ప్రస్తుత పిటిషన్ను విచారిస్తామని పేర్కొంది.