Supreme Court | మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాఫ్ సిరప్ తాగిన పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన ప్రయోజన ప్రయోజన వ్యాజ్యంపై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సర్వోన్నత న్యాయస్థానం కేసును విచారించేందుకు జాబితా చేసింది. న్యాయవాది, పిటిషనర్ విశాల్ తివారీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఘటన తీవ్రమైందని.. అత్యవసర విచారణ అవసరమని పేర్కొంది. చిన్నారుల మృతిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో జాతీయ న్యాయ కమిషన్ లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
విషపూరిత కాఫ్ సిరప్‌ల కారణంగా పిల్లల మరణాలకు సంబంధించిన అన్ని ఎఫ్ఐఆర్లు, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని.. దేశవ్యాప్తంగా ఏకరీతిన, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని న్యాయవాది విశాల్ తివారీ కోర్టును కోరారు. మార్కెట్లోకి ప్రమాదకరమైన మందులు నిరంతరం ప్రవాహంలా వస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్రీకృత దర్యాప్తు అవసరమని.. తక్కువ నాణ్యత మందులు మార్కెట్‌కు వచ్చే ముందు డ్రగ్ సేఫ్టీ, క్వాలిటీ పరీక్ష వ్యవస్థలో ఎక్కడ లోపాలు జరిగాయో తెలుసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అమ్మకాలు, ఎగుమతికి అనుమతి ఇచ్చే ముందు అన్ని అనుమానిత ఉత్పత్తులను ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో టాక్సికాలజీ పరీక్ష చేయించడం తప్పని సరి చేయాలని కోర్టును కోరారు.