Supreme Court | కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దిగువ కోర్టు విచారణపై స్టేను మరో నాలుగువారాలు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులను రద్దు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో.. సుప్రీంలో సవాల్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ట్రయల్ కోర్టులో విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం థరూర్ పిటిషన్‌పై సమాధానం చెప్పేందుకు ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదుదారుడికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు పరువునష్టం కేసుపై స్టే కొనసాగుతుందని చెప్పింది.
మోదీపై వ్యాఖ్యలపై బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే, కేసును రద్దు చేసేందుకు హైకోర్టు ఆగస్టు 29న నిరాకరించింది. అయితే, దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 10న ట్రయల్ కోర్టులో విచారణను సుప్రీం నిలిపివేసింది. తనను ముద్దాయిగా దిగువ కోర్టు ఇచ్చిన 2019, ఏప్రిల్ 27 నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బబ్బర్ దిగువ కోర్టులో ఫిర్యాదు చేశారు. శశిథరూర్ బెంగళూరులో ఓ కార్యక్రమంతో మాట్లాడుతూ.. ‘మోదీని శివలింగంపై తేలులా ఆర్ఎస్ఎస్ వారు భావిస్తుంటారని.. ఆ తేలును చేతితో తీసివేయలేం.. చెప్పుతో కొట్టలేం అనుకుంటారు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ కోర్టు పరువు నష్టం కేసు దాఖలు చేశారు.