న్యూఢిల్లీ: దివ్యాంగుల గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం కఠినమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు చెప్పింది. అంగ వైకల్యాలు, అరుదైన జన్యుపరమైన లోపాలు గల వ్యక్తులను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి చెప్పింది. ఈ చట్టం ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో ఉండాలని తెలిపింది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి ధర్మాసనం ఈ పిలుపునిచ్చింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సూచనను ప్రశంసించారు.
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై అశ్లీల, నేరపూరిత, చట్ట విరుద్ధ కంటెంట్‌ను నియంత్రించడానికి తటస్థ, స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి గల ఓ వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు తెలిపింది. దివ్యాంగులను కించపరిచే వ్యాఖ్యలను నిరోధించేందుకు మార్గదర్శకాల రూపకల్పన ప్రక్రియ జరుగుతున్నదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రసార శాఖ తెలిపింది.
‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షో హోస్ట్ సమయ్ రైనా, ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విపుల్ గోయల్, బల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలీ ఠక్కర్, నిషాంత్ జగదీష్ తన్వర్ దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మెస్సర్స్ ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి ఈ సలహా ఇచ్చింది. నిందితులను ఉద్దేశించి, దివ్యాంగుల విజయగాథలను వివరిస్తూ నెలకు రెండు ప్రోగ్రామ్‌లు లేదా షోలు చేయాలని, తద్వారా వచ్చిన నిధులను దివ్యాంగులకు చికిత్స చేయించడానికి ఖర్చు చేయాలని ఆదేశించింది.