Supreme Court : దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అందుకోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. లోటుపాట్లను సవరించి త్వరలోనే లైవ్ స్ట్రీమింగ్‌ను అమలులోకి తీసుకురానున్నారు. కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకుంది.
కానీ ఆ నిర్ణయం ఆచరణలోకి రాలేదు. అయితే, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన రోజు.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం నాటి కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయించింది. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కసరత్తు జరుగుతోంది.