Supreme Court | ట్రయల్ కోర్టులను ‘ఇన్ఫీరియర్ కోర్టులు’ అని పిలవడం మానాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీ విభాగాన్ని ఆదేశించింది. అలాగే, ట్రయల్ కోర్టు రికార్డులను దిగువ కోర్టు రికార్డులు పిలువొద్దని చెప్పింది. జీవిత ఖైదు విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కోర్టు రిజిస్ట్రీని ట్రయల్ కోర్టులను దిగువ కోర్టుగా పిలువడం తప్పని.. అలాగే, ట్రయల్ కోర్టు రికార్డులను దిగువ కోర్టు రికార్డులు పిలువకూడదని చెప్పింది.
ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా రిజిస్ట్రీ నుంచి ట్రయల్ కోర్టు రికార్డుల సాఫ్ట్ కాపీని ధర్మాసనం కోరింది. అయితే, రికార్డ్ చేసిన తర్వాత.. ప్రస్తుత ఆర్డర్లో ట్రయల్ కోర్టులను దిగువ కోర్టులుగా పేర్కొనడాన్ని గమనించిన కోర్టు.. ట్రయల్ కోర్టు అని పిలువడం సముచితమని సుప్రీంకోర్టు తెలిపింది. ఉత్తర్వును గమనించాల్సిందిగా రిజిస్ట్రార్ (జుడీషియల్)ను సైతం ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. 2022 నవంబర్లో సీజేఐ డీవై చంద్రచూడ్ సైతం జిల్లా కోర్టులను సబార్డినేట్ కోర్టులుగా పిలువొద్దని సూచించారు. న్యాయ వ్యవస్థలో కోర్టులన్నీ సమగ్ర పాత్ర పోషిస్తాయన్నారు. జిల్లా న్యాయవ్యవస్థను ‘సబార్డినేట్’ న్యాయవ్యవస్థగా భావించే.. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.