న్యూఢిల్లీ, జనవరి 5: ఉత్తరాఖండ్‌లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్‌భూల్‌పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. రైల్వే సంస్థ తనదని పేర్కొంటున్న 29 ఎకరాలలోని ఆక్రమణలను తొలగించాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఇది ‘మానవీయ సమస్య’ అని, రాత్రికి రాత్రి 50 వేల మందిని వారి ఇండ్ల నుంచి వెళ్లగొట్టలేమని పేర్కొంది. దీంతో దాదాపు పక్షం రోజులుగా కంటిమీద కునుకులేకుండా ఆందోళన చెందిన బన్‌భూల్‌పురా వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తీర్పు ప్రకటన వెలువడగానే సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. కొందరు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్దాలుగా నివసిస్తున్న తమను చెదరగొట్టేందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేతో కలిసి చేసిన కుట్ర భగ్నమైందని పేర్కొన్నారు.
అత్యధికంగా ముస్లిం కుటుంబాలు ఉన్న ఈ ప్రాంత భౌగోళిక రూపురేఖలు మార్చేందుకే కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కుట్ర పన్నాయంటూ స్థానికులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ స్థలంలో 50 ఏండ్లకు పైగా నివసిస్తున్న వారు చాలామంది ఉన్నారని, ఈ సమస్యలో మానవీయ కోణం ఉన్నదని పేర్కొంది. ఈ సమస్యకు అధికారులు ‘ఆచరణాత్మక పరిష్కారాన్ని’ చూడాలని ఆదేశించింది.
ఇదీ వివాదం..
దేశానికి స్వాతంత్య్రం రాకమునుపే ఏర్పడిన బన్‌భూల్‌పురా బస్తీలో.. రైల్వే లెక్క ప్రకారం 4,365 నివాసాలు ఉన్నాయి. ఈ స్థలానికి తామే యజమానులమని, దశాబ్దాలుగా నివసిస్తున్న తమ కోసం ప్రభుత్వం స్కూళ్లు, దవాఖాన, కాలేజీ, నీరు, డ్రైనేజీ సదుపాయం కల్పించిందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ఉన్నపళంగా తమను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయడంతో వారు నిరసనలు, ఆందోళనలు, సామూహిక ప్రార్థనలు ప్రారంభించారు.
ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు అటు రైల్వేలకు, ఇటు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ప్రతివాదుల నుంచి సమాధానం వచ్చేంత వరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ భూమిపై హక్కులు లేనివారి గుర్తించి, వారికి పునరావాసం కల్పించేందుకు ఆచరణాత్మక ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కోర్టు పేర్కొంది. అలాగే రైల్వే అవసరాన్ని గుర్తించి మిగిలినవారికి పునరావాస పథకాలను అమలుచేసే విషయాన్ని కూడా ఆలోచించాలని తెలిపింది. ఆ ప్రజలను ఖాళీ చేసేందుకు పారా మిలటరీ దళాలను పిలిపించాలన్న వాదన సరైంది కాదని తేల్చి చెప్పింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.