న్యూఢిల్లీ: గంగా నది తీవ్రంగా కాలుష్యానికి(Ganga Pollution) గురి అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్లో గంగానదిలో ట్రీట్మెంట్ చేయని వ్యర్థ జలాలను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ రెండో వారంలో ఈ అంశంపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం పేర్కొన్నది. గంగా నదిలోకి వ్యర్థ జలాలను రిలీజ్ చేస్తున్న ఘటనలో ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లు ఫిబ్రవరి 9వ తేదీన ఎన్జీటీ తన ఆదేశాల్లో తెలిపింది. సుమారు 151 పేజీల రిపోర్టులో ఉత్తరాఖండ్ పొల్యూషన్ బోర్డును ట్రిబ్యునల్ తప్పుపట్టింది.