Supreme Court | కళాశాల క్యాంపస్‌లో హిజాబ్, బుర్కా, నిఖాబ్ ధరించకూడదంటూ చెంబూరు కళాశాల జారీ చేసిన సర్కుల్యర్పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ముంబయిలోని ఎన్జీ ఆచార్య, డీకే మరాఠే కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కళాశాల ఆదేశాలను సమర్థిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కళాశాల విధించిన షరతులపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేంటీ ? అలాంటి రూల్ పెట్టొద్దు.
మతాన్ని బయటపెట్టకూడదా..? విద్యార్థుల మతం వెల్లడి కాకూడదనే నిబంధన విధించారంటూ కాలేజీ యాజమాన్యం వాదనలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థుల పేర్లు మతాన్ని బహిర్గతం చేయడం లేదా? నెంబర్స్ ద్వారా వారిని గుర్తించమని అడుగుతారా? అంటూ జస్టిస్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కాలేజీ తరఫు సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ ఇది ప్రైవేట్ సంస్థ అని చెప్పగా.. కాలేజీ ఎప్పటి నుంచి పని చేస్తుందని జస్టిస్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 2008 నుంచి కళాశాల ఉనికిలో ఉందని చెప్పగా.. ఇన్నాళ్లు మీరు ఎందుకు సూచనలు చేయలేదు..? మతం అకస్మాత్తుగా గుర్తించారా? ఏళ్ల తర్వాత ఇలాంటి సూచనలు చేయడం దురదృష్టకరమని.. తిలకం ధరించిన వారిని సైతం అనుమతించబోమని చెబుతారా? అంటూ జస్టిస్ ఖన్నా న్యాయవాదిని ప్రశ్నించారు.
441 మంది ముస్లిం విద్యార్థులు కళాశాలకు సంతోషంగా హాజరవుతున్నారని.. కొందరు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. అయితే, నచ్చిన దుస్తులు ధరించేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలని న్యాయస్థానం తెలిపింది. ఈ విషయంలో స్పందన చెప్పాలని ముంబయి ఎడ్యుకేషన్ సొసైటీని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కళాశాలకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను నవంబవ్వాయిదా వేసింది. స్టే ఆర్డర్‌ను ఎవరూ దుర్వినియోగం చేయొద్దని బెంచ్ స్పష్టం చేసింది. ఆర్డర్లో సవరణలు కోరేందుకు కళాశాల అధికారులకు అనుమతి ఇచ్చింది.