న్యూఢిల్లీ : భారత భూమిని చైనా కబ్జా చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. “2,000 చ.కి.మీ.ల భారత భూమిని చైనా కబ్జా చేసినట్లు మీకు ఎలా తెలుసు? మీరు నిజమైన భారతీయుడు అయితే, ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదు” అని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. రాహుల్ గాంధీ 2022లో నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’లో మాట్లాడుతూ, చైనా దళాలు అరుణాచల్‌లో భారత సైనికులను కొడుతున్నారని ఆరోపించారు. 2022 డిసెంబరులో అరుణాచల్‌లోని తవంగ్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం లొంగిపోయాయని ఆరోపించారు.
భారత సైన్యాన్ని ఆయన అవమానించారని ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. లక్నోలోని స్పెషల్ కోర్టు విచారణకు హాజరుకావాలని రాహుల్‌కి సమన్లు జారీ చేసింది. దీనిపై ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు సమన్లు జారీ చేయడానికి ముందు తనపై నమోదైన ఆరోపణలను సరిచూసి ఉండవలసిందని రాహుల్ వాదించారు. ఈ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. సైన్యాన్ని అపఖ్యాతిపాలు చేసే వ్యాఖ్యలు చేసే హక్కు వాక్ స్వాతంత్య్రం హక్కులో భాగం కాదని స్పష్టంచేసింది. దీనిపై అపీలును సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. రాహుల్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ, ఇలాంటి విషయాలను రాహుల్ చెప్పలేకపోతే, ఆయన ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. జస్టిస్ దత్తా స్పందిస్తూ, అలాంటపుడు ఇలాంటి విషయాలను పార్లమెంటులో ఎందుకు చెప్పరని ప్రశ్నించారు.