Supreme Court | పవర్ ఉందని ప్రభుత్వాలను పడగొడతారా.. గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court | పార్టీల్లో అంతర్గత కలహాలున్నప్పుడు రాష్ట్ర గవర్నర్ తన అధికారాలను ఉపయోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విశ్వాసపరీక్షకు ఆదేశిస్తే ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉన్నదని శివసేన వర్సెస్ శివసేన కేసులో మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ పాత్రపై ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Supreme Court | న్యూఢిల్లీ, మార్చి 15: పార్టీల్లో అంతర్గత కలహాలున్నప్పుడు రాష్ట్ర గవర్నర్ తన అధికారాలను ఉపయోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విశ్వాసపరీక్షకు ఆదేశిస్తే ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉన్నదని శివసేన వర్సెస్ శివసేన కేసులో మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ పాత్రపై ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం పడిపోవటానికి దారితీసే ఎలాంటి చర్యలకైనా గవర్నర్ దిగరాదని సుప్రీం చురకలు వేసింది. సుప్రీం కోర్టులో శివసేన వివాదంపై విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగితే వెంటనే బలపరీక్షకు ఆదేశించరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సూచించింది. ప్రభుత్వం కుప్పకూలే ఎలాంటి చర్యలకు గవర్నర్లు పాల్పడరాదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. మూడేండ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వపాలనలో పాలుపంచుకున్న తర్వాత రాత్రికి రాత్రి ఏమైందంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలనుద్దేశించి సుప్రీం ప్రశ్నించింది. శివసేనలో తిరుగుబాటు, అనంతర రాజకీయ పరిణామాలపై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
గవర్నర్లు ఎలా వ్యవహరించాలి?
ఠాక్రే ప్రభుత్వం కూలిపోవటంలో అప్పటి గవర్నర్ బీఎస్ కొశ్యారీ పాత్రను ప్రస్తావించటంతో పాటు అధికారాల విషయంలో గవర్నర్ ఏవిధంగా వ్యవహరించాలో సుప్రీం కోర్టు సూచనలు చేసింది. అధికారపార్టీలో అసంతృప్తి, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు విశ్వాస పరీక్షకు ఆదేశించేందుకు తగిన కారణాలు కాదని స్పష్టం చేసింది. అభివృద్ధి నిధుల విషయంలో లేదా పార్టీ నైతికత నుంచి పక్కకు తప్పుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారని, అయితే అది విశ్వాసపరీక్షకు పిలిచేందుకు సరిపోతుందా? అని గవర్నర్‌నుద్దేశించి ప్రశ్నించింది. విశ్వాసపరీక్షకు పిలవటమంటే ప్రభుత్వం కూలిపోవచ్చనే విషయాన్ని గవర్నర్లు గుర్తుంచుకోవాలని అభిప్రాయపడింది.
రెబల్స్‌ను ఇలా ప్రశ్నించాల్సింది!
అధికార పార్టీలో అసంతృప్తి ఉన్నప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఏమని ప్రశ్నించాలో కూడా సుప్రీం తెలియచేసింది. ‘మూడేండ్లుగా మీరేం చేస్తున్నారు? ఎన్నికలు జరిగిన ఒక నెల తర్వాత బీజేపీని వదిలి.. కాంగ్రెస్‌తో కలిశారు. అది వేరే విషయం. మూడేండ్లు కలిసి ఉన్నారు. అసంతృప్తి ఉన్నదని 34 మంది ఎమ్మెల్యేల బృందం అకస్మాత్తుగా ఒక రోజు చెప్పా’రని పేర్కొన్నారు. బలపరీక్షకు ఆధారం ఏమిటి? అని బెంచ్ పదేపదే ప్రశ్నించింది. ఉద్ధవ్ ఠాక్రేపై రెబల్స్ విశ్వాసం కోల్పోయారని సొలిసిటర్ జనరల్ పేర్కొనగా.. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో ఒక పార్టీలో నెలకొన్న అసంతృప్తి మాత్రమే పరిగణనలోకి తీసుకుని గవర్నర్ విశ్వాసపరీక్షకు పిలవటం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు చెప్తూ ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నది. ఈ విషయంలో ప్రతిపక్ష నేత లేఖరాయటం అనేది విషయం కాదని, ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, అధికారపార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని లేఖలు రాస్తూనే ఉంటారని జడ్జిలు పేర్కొన్నారు.
మాకు న్యాయం జరుగుతుంది: ఠాక్రే
ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన చట్టసభలు, మీడియా, పరిపాలనా వ్యవస్థలు బీజేపీ చేతుల్లో ఉన్నాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీఎం ఏక్నాథ్ షిండేకు మహారాష్ట్రలో సంఖ్యాబలం మాత్రమే ఉన్నదని, ప్రజాబలం లేదని ఠాక్రే తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మహావికాస్ అఘాడినే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం షిండే ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ఫిరాయింపులపైనే దృష్టిపెట్టారని విమర్శించారు. శివసేన గుర్తింపు చిహ్నం విషయంలో కూడా తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు ఠాక్రే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

