Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విశిష్ట అధికారాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోత విధించింది. మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టులకు సంబంధించి ఈడీ దూకుడుకు బ్రేకులు వేసింది. మనీలాండరింగ్ ఫిర్యాదులకు సం బంధించిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు ఎట్టిపరిస్థితుల్లో అరెస్టు చేయకూడదని స్పష్టం చేసింది.
ఒకవేళ సదరు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే.. ఈడీ తప్పనిసరిగా ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45కి సంబంధించి ‘ట్విన్ టెస్ట్ ఫర్ బెయిల్’పై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ప్రధానాంశాలు
ఏమిటీ కేసు?
మనీలాండరింగ్ ఫిర్యాదును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత కూడా సదరు కేసులోని నిందితుడు బెయిల్ కోసం పీఎంఎల్ఏ సెక్షన్ 45లోని కఠినమైన రెండు పరీక్షలను (ట్విన్ టెస్ట్ ఫర్ బెయిల్) నెగ్గాలా? అంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం జడ్జిమెంట్‌ను వెలువరించింది.
ఏమిటీ ట్విన్ టెస్ట్ ఫర్ బెయిల్?
మనీలాండరింగ్ కేసులో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొంటే, దాన్ని పొందడానికి పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. రెండు పరీక్షలను నెగ్గాల్సి ఉంటుంది. అందులో మొదటిది.. నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు సమ్మతించాలి. రెండోది.. అప్పటివరకూ జరిగిన విచారణలో నిందితుడు దోషిగా తేలకూడదు. అలాగే, బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ ఎలాంటి ఆర్థిక నేరాలకు సదరు నిందితుడు పాల్పడబోడని కోర్టు నమ్మాలి. ఈ రెండు పరీక్షల్లో నిందితుడు పాస్ అయితేనే, ఈ తరహా కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరవుతుంది.
ఇప్పటివరకూ అలా.. ఇకపై ఇలా..
మనీలాండరింగ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి సదరు వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని విశ్వసిస్తే అప్పుడు సెక్షన్ 19 కింద నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేసేవారు. కోర్టు సమన్లకు నిందితులు సమాధానమివ్వడానికి ముందే ఈ అరెస్టులు జరిగేవి. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును బట్టి.. పీఎంఎల్ఏకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే, నిందితుడిని అరెస్టు చేయాలంటే ఈడీ ముందుగా ప్రత్యేక కోర్టు అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.