లఖింపూర్ ఖీరీ (యూపీ), అక్టోబర్ 8: లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనలకు కారణమైన నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వారిని అరెస్టు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్ర అసంతృప్తి కలిగించాయని పేర్కొంది. ‘మిగతావారి విషయంలో కూడా ఇలాగే చేస్తారా?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం యూపీ పోలీసులను ప్రశ్నించింది. ఈ కేసులో ప్రభుత్వం చర్యలు కేవలం మాటల్లోనే ఉన్నాయని, చేతల్లో శూన్యమన్నది.
అలాంటప్పుడు కేసు ఎలా ముందుకెళ్తుంది?
కేసులో అనుకున్న స్థాయిలో పురోగతి సాగలేదన్న ధర్మాసనం వ్యాఖ్యలతో యూపీ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే ఏకీభవించారు. ధర్మాసనం ముందుకు మళ్లీ ఈ కేసు విచారణ వచ్చేనాటికి కేసులో పురోగతి లేకపోతే, సీబీఐకి అప్పగించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘సున్నిత పరిస్థితి దృష్ట్యా మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. సీబీఐతో కేసు విచారణ పరిష్కారం కాదు. యూపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్‌లో అందరూ స్థానిక అధికారులే ఉన్నారు. అలాంటప్పుడు కేసులో పురోగతి ఏముంటుంది? చేతులు కట్టుకు కూర్చుంటామంటే కుదరదు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. దసరా తర్వాత ఈ కేసు విచారణను కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను సుప్రీం కోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది.
మీడియా కథనాలపై ధర్మాసనం అసహనం
లఖింపూర్ బాధిత రైతు కుటుంబాలను జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శించారని ఓ వార్తాసంస్థ ట్వీట్ చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు పోస్ట్ చేయవద్దని సూచించింది.
నా కుమారుడు అమాయకుడు: అజయ్ మిశ్రా
లఖింపూర్ కేసులో ఆశిష్ మిశ్రాకు పోలీసులు మళ్లీ సమన్లు జారీచేశారు. శనివారం విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు, అస్వస్థతకు గురవ్వడం వల్లే తన కొడుకు శుక్రవారం పోలీసుల విచారణకు హాజరుకాలేదని అజయ్ మిశ్రా పేర్కొన్నారు. తన కుమారుడు అమాయకుడు అని తెలిపారు. ఇదిలావుండగా ఆశిష్ మిశ్రా దేశాన్ని విడిచి నేపాల్‌కి పారిపోయినట్టు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.
సాక్ష్యాలు చూపించండి..: యోగి
ఆశిష్ మిశ్రాను కాపాడటానికి బీజేపీ ప్రభు త్వం ప్రయత్నిస్తుందన్న ఆరోపణలపై యూపీ సీఎం యోగి స్పందించారు. మిశ్రా కారు నడిపినట్టు సాక్ష్యాలు ఉంటే ఎవరైనా అప్లోడ్ చేయవచ్చని, చర్యలు తీసుకొంటా మని అన్నారు.
లఖింపూర్ ఘటనపై సుప్రీం తీరు భేష్: దుష్యంత్ దవే
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖీరీ కేసు విషయంలో సుప్రీంకోర్టు జోక్యంపై ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే ప్రశంసలు కురిపించారు. యూపీ సర్కారుకు ఎలాంటి ఆదేశాలు జారీచేయకుండానే కేసు పురోగతికి కోర్టు ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. పౌరుల హక్కులను కాపాడటానికి న్యాయస్థానాలు ముందుంటాయని అత్యున్నత ధర్మాసనం నిరూపించిందన్నారు. గతంలోని వారితో పోలిస్తే సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలి కాలంలో ఎన్నో గొప్ప పనులను చేశారని కొనియాడారు. రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రమాణాలకు ఆయన విశ్వాసపాత్రుడిగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. పౌరుల హక్కుల రక్షణలో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు పాత్రపై తాను సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. కాగా సుప్రీంకోర్టు, సీజేఐలపై సునిశిత విమర్శలు చేసే దుష్యంత్.. తాజాగా సుప్రీంకోర్టుపై ప్రశంసలు కురిపించడం విశేషం.