(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ముస్లిం మహిళలకు భరణం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు సీఆర్పీసీ సెక్షన్ 125 కింద తమ భర్త నుంచి భరణం కోరొచ్చని తెలిపింది. మతంతో సంబంధం లేకుండా వివాహితులందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఏమిటీ కేసు?
విడాకులు ఇచ్చిన భార్యకు నెలకు రూ. 20 వేల చొప్పున భరణం చెల్లించాలంటూ మహమ్మద్ అబ్దుల్ సమాద్ అనే వ్యక్తిని కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అబ్దుల్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం.. పిటిషనర్ అభ్యర్థన మేరకు భరణాన్ని రూ.10 వేలకు తగ్గించింది. ఆరు నెలల్లోగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టుకు సూచించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం 2017లో తాము విడాకులు తీసుకొన్నామని, ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివర్స్) యాక్ట్, 1986 ప్రకారం.. సీఆర్పీసీ సెక్షన్ 125 పరిధిలోకి ముస్లిం మహిళలు రాబోరని వాదించాడు. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం వచ్చే భరణంతో పోలిస్తే, ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివర్స్) యాక్ట్, 1986 కింద లభించే భరణం ఇంకా ఎక్కువని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించాడు. పిటిషనర్ వాదనలతో విభేదించిన అత్యున్నత ధర్మాసనం.. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాలంటూ ఆదేశించింది.
భరణం చరిత్ర ఇప్పటిది కాదు..
విడాకులు ఇచ్చిన భార్యకు భరణం చెల్లించే కేసులు కొత్తవేం కాదు. 1985లో షా బానో కేసు ఇందులో ప్రధానమైంది. మతంతో సంబంధంలేకుండా విడాకులు ఇచ్చిన మహిళలకు భరణం చెల్లించాల్సిందేనని సీఆర్పీసీ సెక్షన్ 125ను ఉటంకిస్తూ ఆ సమయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే మరుసటి ఏడాది తీసుకొచ్చిన ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్) చట్టం, 1986.. ఈ తీర్పును నీరుగార్చింది.
ఇద్దత్ సమయం (విడాకులు తీసుకొన్న తర్వాత 90 రోజుల వ్యవధి)లోనే భార్యకు.. భర్త భరణం చెల్లించాలని, ఆ మూడు నెలలు పూర్తయ్యాక, చెల్లించాల్సిన పనిలేదని ఆ చట్టం పేర్కొంది. ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టు గడపతొక్కారు. దీంతో ధర్మాసనం.. విడాకులు ఇచ్చిన ముస్లిం భార్యకు ఇద్దత్ సమయంలోనే కాకుండా ఆమె మరో వివాహం చేసుకోవడం లేదా తనకు తానుగా ఆర్థికంగా నిలదొక్కుకునేవరకూ భర్త భరణం చెల్లించాలని ఆదేశించింది. తాజాగా.. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం.. మిగతా వారిలాగే విడాకులు తీసుకొన్న ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.