న్యూఢిల్లీ: జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు, ఎన్నికల సందర్భంగా నల్ల ధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిదిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఆరు రాజకీయ పార్టీలను ఆదేశించింది.
ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్లపై తుది విచారణను సావధానంగా వింటామని, ఈలోగా వాదనలు పూర్తి చేద్దామని సీజేఐ తెలిపారు. తదుపరి విచారణ ఏప్రిల్ 21కి వాయిదా వేసింది.