High Court | న్యూఢిల్లీ, డిసెంబర్ 21: పెండ్లి అనేది పరస్పర నమ్మకం, సహచర్యం, పంచుకున్న అనుభవాలపై నిర్మించుకునే బంధమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తమిళనాడుకు చెందిన ఓ జంట 2004 నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి 2018లో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘వివాహ బంధానికి కీలకమైన పరస్పర నమ్మకం, సహవాసం, అనుభవాలు పంచుకోవడం అనే అంశాలు చాలాకాలం పాటు దంపతుల నడుమ లేకపోతే ఆ వివాహ బంధం కేవలం చట్టపరమైన లాంఛనంగా మారిపోతుంది’ అని పేర్కొన్న ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. భార్యకు భరణం కింద రూ.50 లక్షలు, కూతురి చదువు, పెండ్లి కోసం మరో రూ.50 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది.