న్యూఢిల్లీ: కమర్షియల్ (వాణిజ్య) వాహనాలను నడిపే డ్రైవర్లకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. లైట్ మోటర్ వెహికల్ (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారు 7,500 కిలోల కంటే తక్కువ బరువున్న వాణిజ్య వాహనాలను నడపవచ్చని, అందుకు మరో ప్రత్యేక లైసెన్సు అవసరం లేదని స్పష్టం చేసింది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన నిబంధనలపై స్పష్టతనిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. ఎల్ఎంవీ లైసెన్సు ఉన్నవారు రవాణా వాహనాలను నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణమంటూ బీమా కంపెనీలు చేసిన వాదనను తోసిపుచ్చింది. 2017లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థిస్తూ.. బీమా కంపెనీల పిటిషన్లను కొట్టివేసింది. మోటరు వాహనాల చట్టం-1988 నిబంధనలు మధ్యస్థ, భారీ వాహనాలతోపాటు 7,500 కిలోల కంటే అధిక బరువున్న ప్రయాణికుల వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
నీట్ యూజీ-2024పై రివ్యూ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ, నవంబర్ 6: నీట్-యూజీ 2024 పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న వాదనను సుప్రీంకోర్టు మరోమారు తోసిపుచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించి ఆగస్టు 2 నాటి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఎలాంటి లోపాలూ లేవని, తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులో పేర్కొన్నది. అంతేకాదు, ఈ అంశంపై బహిరంగ కోర్టు విచారణ జరపాలన్న విన్నపాన్ని సైతం ధర్మాసనం నిరాకరించింది.