Supreme Court | బీమా పరిహారం చెల్లింపుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనం రూట్ తప్పిందని.. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందున ప్రమాద బాధితులకు బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్కరించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారాన్ని కంపెనీలు తిరస్కరించడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. బీమా పాలసీ ఉద్దేశం రక్షణ కల్పించడమే తప్ప.. సాకులు చెప్పడం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. బీమా పాలసీ ఉద్దేశం వాహన యజమాని లేదంటే ఆపరేటర్‌ను థర్డ్ పార్టీకి హాని కలిగించే.. ఊహించని, లేదంటే దురదృష్టకర సంఘటనల నుంచి రక్షించడమని.. పర్మిట్ ప్రాంతం వెలుపల ప్రమాదం జరిగినందున బాధితుడికి, వారి కుటుంబాలకు పరిహారం నిరాకరించడం న్యాయానికి విరుద్ధమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం తెలిపింది.
ప్రమాదంలో బాధితుడి తప్పిదం లేదని.. అలాంటి సమయంలో అతనికి పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. సంబంధిత పరిహారాన్ని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని తెలిపింది. 2014 నాటి కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2014 అక్టోబర్ 7న కర్నాకటలో ఓ బస్సు మోటార్ సైకిలిస్ట్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ కేసులో బాధితుడికి వడ్డీతో కలిపి రూ.18.86లక్షల పరిహారం ఇవ్వాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పును వెలువరించింది. పరిహారం సరిగా లెక్కించలేదని పిటిషనర్.. ప్రమాదానికి కారణమైన వాహనం రూట్ పర్మిట్‌ను ఉల్లంఘించిందని బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు తీర్పు ప్రకారం.. బీమా కంపెనీ ముందుగా బాధితుడికి పరిహారం చెల్లించి.. ఆపై యజమాని నుంచి తిరిగి డబ్బును వసూలు చేసుకోమని చెప్పింది.
ట్రిబ్యునల్ ఆదేశాలను బీమా కంపెనీతో పాటు బస్ యజమాని కర్నాటక హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు బీమా కంపెనీని బాధితుడికి ముందుగా పరిహారం చెల్లించి.. ఆ తర్వాత వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోమని ఆదేశించింది. తాజాగా అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాహనం పర్మిట్ ప్రాంతం వెలుపల ఉందని.. అందువల్ల బీమా పాలసీ వర్తించదని బీమా కంపెనీ వాదించింది. అదే సమయంలో వాహనం యజమాని పరిహారం బాధ్యత కంపెనీదేనని వాదనించగా.. రెండు అప్పీళ్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘బాధితుడు, అతని కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదు. వాహనం పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ బీమా కంపెనీ పరిహారం చెల్లించాలి’ అని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయం భవిష్యత్‌లో ఇలాంటి కేసుల్లో ఒక ఉదాహరణగా నిలువనున్నది.