Supreme Court | న్యూఢిల్లీ, అక్టోబర్ 17: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది పార్లమెంటు మాత్రమేనని తేల్చిచెప్పింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్వలింగ వివాహాల చట్టబద్ధత’పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్న ఈ ధర్మాసనం మొత్తం నాలుగు అంశాలపై తీర్పులను ప్రకటించింది. పలు అంశాలపై సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ కౌల్‌తో జస్టిస్ భల్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ నరసింహ విభేదించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసినప్పటికీ అంతిమంగా ఈ వివాహాలకు చట్టబద్ధతను పార్లమెంటు మాత్రమే తేల్చాలని స్పష్టంచేశారు.
స్వలింగ సంపర్కులు (ఎల్జీబీటీక్యూఏప్లస్ప్లస్) సహజీవనం చేయటం నేరం కాదంటూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేలా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్‌లో మార్పులు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వెలువడింది. ఎల్జీబీటీల కోసం చట్టాలను మార్చటం కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
స్వలింగ సంపర్క జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు లేదని కోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు 3:2 మెజార్టీతో తీర్పు వెలువరించింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ కౌల్ దత్తతకు మద్దతుగా తీర్పునివ్వగా, జస్టిస్ రవింద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ నరసింహ వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు.
సుప్రీంకోర్టు చట్టాలు చేయదని, పార్లమెంటు చేసిన చట్టాలను అవసరమైతే పరిశీలిస్తుందని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. స్వలింగ సంపర్కులపై ఏరకంగానైనా వివక్ష ఉంటే.. వాటిని అధ్యయనం చేసి పరిష్కరించేందుకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తామని కేంద్రప్రభుత్వం తన అఫిడవిట్లో తెలిపిందని, దానిని రికార్డుల్లోకి తీసుకొంటున్నామని చెప్పారు. పెండ్లి చేసుకోవటం అనేది ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు కాదని సీజేఐతోపాటు జస్టిస్ కౌల్, జస్టిస్ భట్ ప్రకటించారు. అయితే, స్వేచ్ఛ, జీవించే హక్కు కల్పిస్తున్న ఆర్టికల్ 21లో వివాహం చేసుకొనే హక్కు కూడా అంతర్లీనంగా ఉన్నదని తెలిపారు. స్వలింగ సంపర్కులపై వివక్షలను రూపుమాపేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.
స్వలింగ సంపర్క సంస్కృతి పట్టణాలు, ఉన్నత వర్గాల్లోనే ఉన్నదన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విధానం అర్బన్, ఎలైట్ వర్గాలకే పరిమితం కాదని, ప్రపంచంలో అన్నిచోట్లా ఉన్నదని స్పష్టంచేసింది. స్వలింగ సంపర్కులు, భిన్న లింగ సంపర్కులు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల వంటివారని, స్వలింగ సంపర్క వివాహాలకు కూడా చట్టబద్ధత కల్పిస్తే వివాహం విషయంలో సమానత్వం కల్పించినట్టు అవుతుందని జస్టిస్ కౌల్ అభిప్రాయపడ్డారు.
లింగమార్పిడిపై కూడా ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘లింగ మార్పిడి చేయించుకోవాలనుకొనే బాల, బాలికలకు.. ఈ అంశంపై పూర్తిగా అవగాహన ఉన్నదో లేదో ముందుగా పరిశీలించాలి. పూర్తి అవగాహనతో ఉన్నవారికి మాత్రమే లింగమార్పిడికి అవకాశం ఇవ్వాలి. విచిత్ర (ఎల్జీబీటీక్యూఐఏప్లస్ప్లస్) జంటలపై ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా వారి బంధంపై ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే పోలీసులు తదుపరి చర్యలు చేపట్టాలి’ అని ధర్మాసనం తెలిపింది.