Supreme Court | శిక్ష పడిన ఖైదీల బెయిల్ పిటిషన్లపై విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు కోర్టు మందలించింది. భిన్నంగా ఆలోచించాలని సర్వోన్నత న్యాయస్థానం.. కేసుల సత్వర పరిష్కారానికి సెలవు దినాల్లోనూ పని చేయాలని సూచించింది. హైకోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. హైకోర్టుకు ఆయా విషయాలను నిర్వహించడం కష్టంగా అనిపిస్తే.. వాటిని సుప్రీంకోర్టుకు సిఫారసు చేయాలని స్పష్టం చేసింది.
అదనపు భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నామని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 853 క్రిమిన్ అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయన్న ధర్మాసనం ఆయా పిటిషనర్లు పదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారని, వ్యక్తి స్వేచ్ఛతో రాజీపడుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఆగస్ట్ 17న విచారించనున్నది. ఇదే సమయంలో 853 కేసుల జాబితాను సమర్పించాలని ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందులో దోషిగా తేలిన ఖైదీ నిర్బంధకాలానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని, ఈ కేసుల్లో ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంత మందికి బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది? అనే వివరాలు సమర్పించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి రెండువారాల సమయం ఇచ్చింది. 15 సంవత్సరాలు పైబడిన, 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఖైదీలకు సంబంధించి హైకోర్టు సీనియర్ రిజిస్ట్రార్ దాఖలు చేసిన నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించింది.
62 బెయిల్ పిటిషన్లను ఇంకా పరిష్కరించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి జూలై 17 వరకు 232 కొత్త బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. మరో వైపు పిల్లలు కనేందుకు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ను వచ్చేవారం లిస్ట్ చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది. రాజస్థాన్ హైకోర్టు నిర్ణయం తర్వాత బెయిల్ కోరుతున్న వారి సంఖ్య పెరిగిందని ఓ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.