న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పరువునష్టం కేసులను నేర చట్టాల నుంచి విముక్తి కల్పించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పరువునష్టం పేరుతో క్రిమినల్ కేసులు దాఖలు అవుతున్న సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది. పరువునష్టం కేసులను డీక్రిమినలైజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైనట్లు సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ద వైర్ ఆన్లైన్ పోర్టల్‌కు సమన్లు జారీ చేసిన కేసులో దాఖలైన పిటీషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ రకంగా స్పందించింది.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అమితా సింగ్ .. ద వైర్ వెబ్‌సైట్‌పై పరువునష్టం కేసును వేసింది. ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం దాఖలు చేసిన కేసులో అమితా సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వానదనల సమయంలో పరువునష్టం కేసులను నేర చట్టాల నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని జస్టిస్ సుంద్రేశ్ అన్నారు. ద వైర్ వెబ్సైట్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 356 ప్రకారం పరువునష్టం కేసులను నేర చట్టాల ప్రకారం పరిష్కరించనున్నారు. గతంలో ఐపీసీ సెక్షన్ 499 కింద ఈ చట్టాలను విచారించేవారు. జేఎన్‌యూ ప్రొఫెసర్ అమితా సింగ్ ఆధ్వరంలో 2016లో వర్సిటీపై ఓ రిపోర్టు తయారైంది. వర్సిటీలో వ్యవస్థీకృత సెక్స్ రాకెట్ జరుగుతున్నట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. 200 పేజీలు ఉన్న ఆ రిపోర్టుపై ద వైర్ వెబ్సైట్ కథనాన్ని రాసింది. జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌కు కూడా ఆ రిపోర్టును సమర్పించినట్లు కథనంలో పేర్కొన్నారు. వర్సిటీపై రిపోర్టు తయారు చేయడంలో ప్రొఫెసర్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు కథనంలో రాశారు. దీంతో ఆ ప్రొఫెసర్ క్రిమినల్ డిఫమేషన్ కేసును దాఖలు చేశారు.