Karnataka elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): బీజేపీ ఊతపదం డబుల్ ఇంజిన్ డబుల్ స్టాండ్‌గా మారింది. తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడితే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కిందట చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. మరి అదే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తామని సుప్రీంకోర్టుకు ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలోనేమో రద్దు చేస్తామనేది ఆ పార్టీనే, అక్కడ కర్ణాటకలో అమలు చేస్తున్నదీ ఆ పార్టీనే.
ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీకి ఒకే రకమైన స్టాండ్ ఉంటుందా? లేక ఒక్కో రాష్ర్టానికి ఒకరకంగా ఉంటుందా? అనేది ప్రశ్న. ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఒక్కో రాష్ర్టానికి ఒక్కో వైఖరిని అవలంబించటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్ఠంగా ఉన్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో ఇతర వెనుకబడిన తరగతుల క్యాటగిరీ కింద ముస్లింలకు కల్పించిన 4 శాతం కోటాను సీఎం బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత నెల మార్చి 27న రద్దు చేసింది. ఈ 4 శాతం రిజర్వేషన్లను వొక్కలిగలు, లింగాయత్‌లకు 2 శాతం చొప్పున కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఏప్రిల్ 18లోగా స్పందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం తమకు కొంత సమయం ఇవ్వాలని కోరడంతో ఏప్రిల్ 25కు కేసును వాయిదా వేసింది. ఎన్నికల ముందు హడావిడిగా తీసుకున్న నిర్ణయం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నదని, లోపభూయిష్ఠంగా ఉన్నదని ధర్మాసనం తప్పుపట్టింది.