న్యూఢిల్లీ: సైనిక దళాల్లోని పర్మనెంట్ కమిషన్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మహిళా మిలిటరీ ఆఫీసర్లు పర్మనెంట్ కమిషన్కు అర్హులు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు అసాధారణ అధికారులను వినియోగించుకున్నది. షార్ట్ సర్వీస్ కమీషన్(ఎస్ఎస్సీ) కింద రిక్రూట్ అయిన మహిళా ఆఫీసర్లు పర్మనెంట్ కమిషన్ పొందేందుకు అర్హులని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
మిలిటరీ ప్రమోషన్ల విధానంలో ఉన్న వ్యవస్థీకృత లోపాలను కోర్టు ఎత్తి చూపింది. మహిళా ఎస్ఎస్సీ ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ను ఇవ్వకపోవడం విధాన నిర్ణయం లోపమని కోర్టు చెప్పింది. ప్రతి ఏడాదికి కేవలం 250 మంది మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలన్న నిబంధనను కూడా కోర్టు కొట్టిపారేసింది. ఆ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, దాంట్లో పవిత్రత లేదని కోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మిలిటరీలో లింగ సమానత్వాన్ని సూచిస్తున్నది. పర్మనెంట్ కమిషన్ పొందినవారు రిటైర్మెంట్ వయసు వరకు విధులు నిర్వర్తించవచ్చు.
సైన్యంలో ఉన్నత పదువులను గతంలో కేవలం పురుషులకు మాత్రమే ఇచ్చేవారు. అయితే తాజా తీర్పుతో మహిళలకు కూడా అత్యున్నత హోదా దక్కే అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ కమిషన్ అనేది తమకే ఉంటుందన్న భావనలో మేల్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు ఉండరాదు అని కోర్టు చెప్పింది. మహిళా ఆఫీసర్ల పట్ల ఉన్న వివక్ష.. అది విధాన రూపకల్పన లోపమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మహిళా ఆఫీసర్లకు చెందిన వార్షిక విశ్వసనీయ నివేదిక(ఏసీఆర్)లను మిలిటరీ ఆఫీసర్లు చాలా తేలికగా తీసుకుంటున్నట్లు కోర్టు చెప్పింది.