న్యూఢిల్లీ: వీధుల నుంచి ప్రతి కుక్కనూ తరిమేయాలని తాము చెప్పలేదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. జంతువుల జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వాటిని చూడాలని మాత్రమే చెప్పినట్లు పేర్కొంది. కుక్కలను చూసి భయపడే వారిని, కుక్క కాటుకు గురైన వారిని కుక్కలు వాసన ద్వారా గుర్తించగలవని, అలాంటి వారిపై దాడి చేస్తాయని తెలిపింది. వీధి కుక్కల కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ కుక్కల ప్రేమికులు పిటిషన్లను దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు తు.చ. తప్పకుండా అమలయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ మెహతా మాట్లాడుతూ, వీధుల్లోని ప్రతి కుక్కనూ తరిమేయాలని తాము చెప్పలేదన్నారు. నిబంధనల ప్రకారం చూడాలని మాత్రమే తాము ఆదేశించామన్నారు.