న్యూఢిల్లీ, జూలై 1: మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీలకు చెందిన సుప్రీంకోర్టు సిబ్బందికి ప్రత్యక్ష నియామకాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ విధానాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రవేశపెట్టింది. జూన్ 24న తన ఉద్యోగులందరికీ జారీచేసిన సర్క్యులర్లో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తెలియచేసింది. ఇది 2025 జూన్ 23 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.
రోస్టర్ లేదా రిజిస్టర్లో ఏవైనా లోపాలు, పొరపాట్లు ఉంటే సిబ్బంది తమ అభ్యంతరాలు లేదా వినతిని రిజిస్ట్రార్(రిక్రూట్మెంట్)కి తెలియచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్క్యులర్ ప్రకారం ప్రమోషన్లలో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం రిజర్వేషన్ కోటా ఉంటుంది. రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, చాంబర్ అటెండెంట్లకు కోటా ప్రయోజనాలు లభిస్తాయి.