Supreme Court | నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసిన పిటిషనర్‌ను సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా మందలించింది. ప్రాణాలతో లేని నేతలపై నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా పిటిషన్లో ఆరోపణలు చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ మహాత్మా గాంధీని కూడా వదిలిపెట్టలేదన్న ధర్మాసనం.. పిటిషనర్ ఉద్దేశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
అయితే, ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (India) కటక్ జిల్లా కార్యదర్శిగా ఉన్నానని పిటిషనర్ పినాక్ పాణి మొహంతీని ప్రజా ప్రయోజనాలు.. ప్రజల మానవ హక్కుల కోసం ఏం చేశారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం ప్రశించింది. ‘మీ వెనక ఎవరున్నారు? ప్రజా ప్రయోజనాల కోసం మీరు ఏం చేశారు. ప్రజల మానవ హక్కుల కోసం మీరు ఏమి చేశారు’ అంటూ ప్రశ్నించిన కోర్టు.. విశ్వాసాన్ని నిరూపించుకోవాలని చెప్పింది. సమాజం కోసం, ముఖ్యంగా మానవ హక్కుల రంగంలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.