న్యూఢిల్లీ: న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం, ఆత్మ నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీషానంద ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్వీయ విచారణ జరిపింది. జస్టిస్ శ్రీషానంద ఇటీవల ఓ మహిళా న్యాయవాదిని మందలించినట్లు, బెంగళూరులోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్థాన్ అని అభివర్ణించినట్లు వచ్చిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందించి, నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.
ఈ నివేదికపై బుధవారం ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి, కేసును ముగించింది. ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ, రాజ్యాంగంలో పేర్కొన్న విలువలు మాత్రమే న్యాయ నిర్ణయానికి మార్గదర్శకం కావాలన్న విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.
ప్రతి న్యాయమూర్తి తన సొంత వైఖరుల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం, ఆత్మ నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండటం అవసరమని తెలిపారు. స్త్రీ ద్వేషంగా పరిగణించడానికి అవకాశం ఇచ్చే వ్యాఖ్యలు చేయరాదని కోర్టులను ఈ ధర్మాసనం హెచ్చరించింది. స్త్రీ లేదా పురుషుడు లేదా మరొక వర్గాన్ని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పింది. భారత్‌లోని ఏ ప్రాంతానైనా ‘పాకిస్థాన్’ అని పిలవకూడదని స్పష్టం చేసింది. జస్టిస్ శ్రీషానంద ఈ నెల 21న బహిరంగంగా క్షమాపణ చెప్పినందు వల్ల ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు చెప్పింది.