న్యూఢిల్లీ: నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నెల 11న జరగనున్న ఈ పరీక్షకు పలువురు అభ్యర్థులకు దూరప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇలాంటి పరీక్షను మేము ఎలా వాయిదా వేయగలం. ఈ రోజుల్లో కొందరు కేవలం పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ వస్తున్నారు. మేము విద్యా సంబంధ నిపుణులం కాదు. ఈ పరీక్ష షెడ్యూల్ను మార్చలేం. పరీక్షను వాయిదా వేస్తే వారాంతంలో రెండు లక్షల మంది విద్యార్థులు, నాలుగు లక్షల మంది తల్లిదండ్రులు రోదించాల్సి వస్తుంది. ఇంతమంది అభ్యర్థుల కెరీర్ను ప్రమాదంలో పెట్టలేం. ఈ పిటిషన్ల వెనుక ఎవరున్నారో మాకు తెలియదు’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఈ పరీక్ష జూన్ 23న జరగాల్సి ఉండగా, పోటీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర వైద్య శాఖ పరీక్షను వాయిదా వేసింది.