న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు.. సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను ఇవాళ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జడ్జీస్ యాక్టు ప్రకారం జస్టిస్ యశ్వంత్‌పై అభిశంసన చేయాలని ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు కోసం లోక్‌సభ స్పీకర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జస్టిస్ యశ్వంత్ పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై వాదనలు చేపట్టింది. అయితే జనవరి 8వ తేదీన తమ తీర్పును కోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
గత ఏడాది మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరగ్గా.. ఆ మంటల్ని ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో కాలిన నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయన అవినీతికి పాల్పడి అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. ఆ ఘటన తర్వాత ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. తదుపరి చర్యలు తీసుకునేవరకు న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టవద్దు అని ఆదేశించారు.
మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ కేసులో ఇన్‌హౌజ్ దర్యాప్తునకు ఆదేశించారు.