Supreme Court | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ.. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) బెయిల్ మంజూరు చేసింది. గత నెల చివర్లో బెయిల్ రావడంతో హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. హైకోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధం అని పేర్కొంది. ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం న్యాయస్థానం.. జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. బెయిల్‌పై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఈడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Also Read..
Supreme Court | బీహార్‌లో కూలుతున్న బ్రిడ్జిలు.. నితీశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Coaching Centres | ఆ యువత కలలు కల్లలయ్యాయి.. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనపై శశి థరూర్