Supreme Court | భార్యాభర్తలంటే వైవాహిక జీవితంలో కష్టసుఖాలను పంచుకోవాలి. కానీ 41 ఏండ్ల క్రితం వివాహమైన ఓ జంట ఒకరిపై మరొకరు 60కి పైగా కేసులు పెట్టుకోవడం చూసి సర్వోన్నత న్యాయస్థానం అవాక్కైంది. 30 ఏండ్ల పాటు కలిసి జీవనం సాగించిన ఈ దంపతులు విభేదాలతో 11 ఏండ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ దంపతుల కేసు బుధవారం సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణలో ఇద్దరు లాయర్ల చాతుర్యాన్ని తప్పక గుర్తించాలని చీఫ్ జస్టిస్ రమణ సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం చమత్కరించింది. ఈ వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి వెళ్లాలని దంపతులకు సూచించింది.
‘ఏం చేద్దాం.. కొన్ని వివాదాలు అట్టే పరిష్కారం కావు.. కొంతమంది తరుచూ గొడవ పడుతూనే ఉంటారు.. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగడానికే ఇష్టపడతారు.. ఎప్పుడైనా ఒకరోజు కోర్టు ముఖం చూడకపోతే ఆ రోజు వారికి నిద్ర పట్టదు’ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్‌లు కృష్ణ మురారి, హిమా కొహ్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాంతియుతంగా వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి వెళ్లడం మంచిదని దంపతుల తరపు న్యాయవాదులకు సూచించింది. మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారం అయ్యే వరకు మిగతా పెండింగ్ కేసుల జోలికి వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
`ఈ కేసులో మీ లాయర్ల చాతుర్యాన్ని తప్పక గుర్తించాలి.. భార్యభర్తలు చాలాసార్లు న్యాయస్థానం మెట్లెక్కడం తనను ఆశ్చర్యానికి గురిచేసింది` అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. ఈ జంట పరస్పరం దాఖలు చేసిన కేసులు ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. తన భర్త తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆ ఇంట్లో తాను ఉండలేనని ఆ మహిళ తెలిపింది. సమగ్ర పరిష్కారానికి సుముఖమేనా అని మహిళ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
తన క్లయింట్ మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని, కానీ హైకోర్టులో విచారణ నిలిపివేయకూడదని మహిళ తరఫు న్యాయవాది కోరారు. కానీ అది సాధ్యం కాదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘మీకు పోరాటంపైనే చాలా ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తున్నది.. ఏదో ఒకటి ఎంచుకోండి.. మధ్యవర్తిత్వం సమయానుకూలం’అని న్యాయస్థానం పేర్కొన్నది. చివరకు మధ్యవర్తిత్వానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. దీంతో ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టు ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌కు ధర్మాసనం రిఫర్ చేసింది. ఈ వివాద పరిష్కారం లో విధి విధానాలను వేగవంతం చేయడానికి ప్రయత్నించాలని ఆదేశించింది. దీని పురోగతిపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని మీడియేషన్ కేంద్రం కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.