Alimony | పెళ్లయిన 14 నెలలకే తన భర్తకు విడాకులు ఇచ్చిన ఓ భార్య ఏకంగా రూ.5 కోట్లు భరణం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆమెవన్నీ గొంతెమ్మ కోరికలని, అవి ఆచరణ సాధ్యం కావని స్పష్టం చేసింది. భరణం విషయంలో ఇలాగే పట్టుబడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఓ మహిళ విడాకులు, భరణానికి సంబంధించిన కేసును జస్టిస్ జేబీ పార్థివాలా ధర్మాసనం విచారించింది. అమెజాన్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త విడాకుల నిమిత్తం తన భార్యకు రూ.35 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ సదరు మహిళ మాత్రం రూ.5 కోట్లు ఇస్తేనే విడాకుల పత్రం మీద సంతకం పెడతానని పట్టుబట్టిందని భర్త తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భర్త తరఫు లాయర్ వాదనలు భార్య తరఫు న్యాయవాది తిరస్కరించారు. మధ్యవర్తిత్వ కేంద్రంలోనే ఆ మొత్తాన్ని రూ.5 కోట్ల నుంచి తగ్గించారని వివరించారు.
భర్త తరఫు న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ పార్దివాలా మాట్లాడుతూ.. ‘ ఆమెను వెనక్కి పిలిచి పొరపాటు చేస్తున్నారు. ఆమెను మీరు భరించలేరు. ఆమె కోరికలు చాలా పెద్దగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. రూ.5 కోట్లను భరణంగా డిమాండ్ చేయడం అసమంజసమని సదరు మహిళను మందలించింది. గత
ఇద్దరికీ వివాహం జరిగి కేవలం 14 నెలలు మాత్రమే అయ్యిందని గుర్తుచేసిన ధర్మాసనం.. భరణం విషయంలో పరస్పర అంగీకారానికి రావాలని తెలిపింది. అయితే భరణం విషయంలో తగ్గి న్యాయంగా డిమాండ్ చేయాలని సూచించింది. అలా కాదని ఒకే మాట మీద ఉంటే.. మేమే ఒక ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని.. అది ఆమెకు నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించింది. అందుకే తగ్గి ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చుకోవాలని సూచించింది. తుది నిర్ణయం తీసుకుని అక్టోబర్ 5వ తేదీన సుప్రీంకోర్టులోని మధ్యవర్తిత్వ కేంద్రంలో హాజరుకావాలని ఆదేశించింది.