న్యూఢిల్లీ: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితా కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహించడంపై సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్(ఈసీ)కు సూటిగా అనేక ప్రశ్నలు సంధించింది. వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టవలసి వచ్చిందని ఎన్నికల కమిషన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 2025 బీహార్ ఎన్నికలకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ముడిపెడుతున్నారని ఈసీని ధర్మాసనం నిలదీసింది.
ఓటరు జాబితా సవరణను అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎందుకు జరుపుతున్నారని పిటిషనర్లు లేవనెత్తిన ప్రశ్నను ధర్మాసనం సమర్థించింది. నవంబర్లో ఎన్నికలు జరగనుండగా ఓటర్ జాబితా సవరణను ఇప్పుడే ఎందుకు జరపవలసి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని ధర్మాసనం పేర్కొంది. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేకుండా దేశం మొత్తమ్మీద స్వతంత్రంగా జరుపుతున్న కార్యక్రమమా అని జస్టిస్ బాగ్చి ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీని ప్రశ్నించారు.
ఓటరు జాబితాకు ఎస్ఐఆర్ చేపట్టిన ఈసీ పౌరసత్వం గురించి ఇప్పుడు ఎందుకు ధ్రువీకరణ జరుపుతోందని జస్టిస్ దూలియా ఈసీని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల ముందే ఈ ప్రక్రియను ఎందుకు చేపట్టవలసి వచ్చిందని ఆయన నిలదీశారు. పౌరసత్వాన్ని ధృవీకరించుకోవడమే ఈసీ ఉద్దేశమైతే ఆ ప్రక్రియను ముందుగానే చేపట్టి ఉండవలసిందని, ఇప్పుడు అది కొద్దిగా ఆలస్యమైందని ధర్మాసనం పేర్కొంది. దీనికి ద్వివేది స్పందిస్తూ ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకు పౌరసత్వాన్ని ధృవీకరించుకోవడం తప్పనిసరని ద్వివేది వాదించారు.
జస్టిస్ ధూలియా స్పందిస్తూ పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారం భారత ఎన్నికల సంఘానికి లేదని, అది కేంద్ర హోం శాఖదని స్పష్టం చేశారు. ఓటరు ధ్రువీకరణ కోసం గుర్తింపు పత్రాలుగా ఆధార్ కార్డు, ఓటరు కార్డు, రేషన్ కార్డును పరిశీలించాలని ఈసీకి సూచించింది.