న్యూఢిల్లీ : శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచడం వల్ల శాసనసభ ఉనికిలో లేకుండా పోతుందని, అటువంటి పరిస్థితిలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలకు అధికారం లేదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రపతికి నివేదించిన బిల్లుల ఆమోదానికి నిర్దిష్టమైన కాలవ్యవధిని సుప్రీంకోర్టు నిర్దేశించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను ధర్మాసనం గురువారం ప్రశ్నించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వలేదని సొలిసిటర్ జనరల్ వాదించగా సీజేఐ గవాయ్ స్పందిస్తూ గవర్నర్ తన బాధ్యతలను నిర్వర్తించని పక్షంలో న్యాయస్థానానికి జోక్యం చేసుకునే అధికారం లేదా అని ప్రశ్నించారు. బిల్లును ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా అన్న విషయం జోలికి తాము పోవడం లేదని, తాము ప్రశ్నించేదల్లా శాసనసభ ఆమోదించిన బిల్లుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ నిరవధికంగా పెండింగ్లో ఉంచితే ఏం చేయాలని సీజేఐ ప్రశ్నించారు.
దీనికి తుషార్ మెహతా జవాబిస్తూ అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు రాజకీయంగా పరిష్కారాలు కనుగొనాలే కాని న్యాయపరంగా కాదని వాదించారు. వీటికి పరిష్కారాలు రాజకీయంగా ఉంటాయని, ప్రజాస్వామిక రాజకీయ ప్రక్రియ ద్వారా ఇటువంటి కేసులు పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు. అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు ఆమోదించిన బిల్లుకు ఆమోదం తెలియచేయకుండా గవర్నర్ నిరవధికంగా పెండింగ్లో ఉంచడం వల్ల శాసనసభ ఉనికి లేకుండా పోతుందని సీజేఐ ప్రశ్నించారు. ఈ సమస్యకు పరిష్కార వేదిక న్యాయస్థానం కాదని తుషార్ మెహతా అన్నారు. రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధించాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని లేదా రాజకీయంగా పరిష్కరించుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు.